ఆ ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

ఎన్నికలకు ముందు తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డి ముగ్గురిపై అనర్హతవేటు వేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ ఈరోజు ప్రకటించారు. 

వారిలో  భూపతిరెడ్డి నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికవగా, యాదవ్‌ రెడ్డి ఎమ్యెల్యేల కోటాలో మండలికి ఎన్నికైయ్యారు. రాములు నాయక్‌ గవర్నర్‌ కోటాలో ఎన్నికయ్యారు. వీరు ముగ్గురు కాక కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో తెరాస ఎమ్మెల్సీ కొండా మురళి, అనర్హత వేటు పడకుండా ముందే జాగ్రత్తపడుతూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కనుక ఆ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినట్లే భావించవచ్చు.