
తెలంగాణ శాసనసభ స్పీకరుగా తెరాస సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయన బాన్సువాడ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖా మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా సిఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులలో ఆయన కూడా ఒకరు. ఆయనకు అపార రాజకీయ, పరిపాలనానుభవం, శాసనసభా వ్యవహారాలపై మంచి పట్టు కలిగి ఉన్నందున స్పీకరుగా నియమించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తాజా సమాచారం.
గత ప్రభుత్వంలో డెప్యూటీ స్పీకరుగా పనిచేసిన పద్మాదేవేందర్ రెడ్డిని స్పీకరుగా నియమించాలని సిఎం కేసీఆర్ భావించినప్పటికీ ఆమె మంత్రిపదవిపై ఆసక్తి చూపుతునందున పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకరుగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవికి మాజీ ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రెడ్యా నాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 17 నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతాయి కనుక ఈలోపుగానే స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులకు పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.