
అగ్రవర్ణాల పేదలకు విద్యా,ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశ్యించబడిన బిల్లును నిన్న లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుపై రాత్రి 10 గంటల వరకు లోక్‌సభలో సుదీర్గంగా చర్చ, అధికార, ప్రతిపక్షా సభ్యుల మద్య వాదోపవాదాలు జరిగాయి. ఆ చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష సభ్యులు బిల్లులో అనేక లోపాలున్నాయని, వాటిని సవరించాలని వాదించినప్పటికీ, చివరికి ఓటింగ్ జరిగినప్పుడు అందరూ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం మూడు ఓట్లు పడటంతో లోక్‌సభ ఆమోదం పొందింది.
దీనిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ సమాధానమిస్తూ, “సుప్రీంకోర్టు కులాలవారీగా రిజర్వేషన్లు 50 శాతంకు మించి పెంచడానికి వీలులేదని చెప్పింది. కానీ ఇప్పుడు ఇవ్వబోతున్న ఈ 10 శాతం రిజర్వేషన్లు ఆర్ధికంగా వెనుకబడిన హిందూ, ముస్లిం, క్రీస్టియన్ తదితర అన్ని మతాలలో ప్రజలకు ఇది వర్తిస్తుంది. కనుక దీనిని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందనే భావిస్తున్నాము,” అని చెప్పారు.
ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. 16వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త సభ్యులతో లోక్‌సభ సమావేశం జరుగుతుంది.