
అగ్రవర్ణాల పేదలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి మోడీ ప్రభుత్వం అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చిన బిల్లుకు లోక్సభలో తెరాస మద్దతు పలికింది. దీనిపై జరిగిన చర్చలో ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, “గత ఏడు దశాబ్ధాలలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాల వైఫల్యాలు, నిర్లక్ష్యం కారణంగానే నేటికీ అన్ని వర్గాల ప్రజలలో ఆర్ధికవెనుకబాటు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం విభజన కారణంగా రాష్ట్రంలో ముస్లిం జనాభా 12% కి చేరింది. ఆ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం వారికి 12% రిజర్వేషన్లు కల్పించాలని భావించి, దాని కోసం శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించింది. కానీ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం పక్కన పడేసింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ ఈబీసీ బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తెరాస మద్దతు పలుకుతోంది. రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో ఉండాలని తెరాస కోరుకొంటోంది,” అని అన్నారు.