కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం

కేంద్రప్రభుత్వం ఈరోజు సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్రమంత్రివర్గ  సమావేశంలో అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ రిజర్వేషన్లకు అర్హతలు: 

1. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. 

2. సొంత వ్యవసాయ భూమి ఉన్నట్లయితే 5 ఎకరాల లోపు ఉండాలి. 

3. సొంత ఇల్లు ఉన్నట్లయితే 1,000 చదరపు అడుగులలోపు ఉండాలి. 

4. నోటిఫైడ్‌ పురపాలిక పరిధిలో నివాస స్థలం 109 గజాలకు మించి ఉండకూడదు. 

5. నోటిఫైడ్‌ కాని మున్సిపాలిటీ పరిధిలో నివాస స్థలం 209 గజాల కంటే మించి ఉండరాదు. 

ఈ పరిధిలో ఉన్న అగ్రవర్ణాలవారు 10 శాతం రిజర్వేషన్లకు అర్హులుగా పరిగణింపబడతారు. దేశంలో కోట్లాదిమంది మద్యతరగతి కుటుంబాలు పైన పేర్కొన్న పరిధిలోనే ఉన్నాయి కనుక ఇది వారికి పెద్ద వరంగానే భావించవచ్చు. 

అయితే ఈ రిజర్వేషన్లను అమలుచేయాలంటే ముందుగా 50శాతం రిజర్వేషన్ల పరిమితిని పెంచుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిపక్ష పార్టీలు సహకారం కావాలి. రాజ్యసభలో బిజెపికి తగినంత బలం లేదు కనుకనే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకోలేకపోయింది. కనుక ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలదో లేదో చూడాలి. ఈ బిల్లు కోసం పార్లమెంటు సమావేశాలు రెండు రోజులు పొడిగించాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.