స్టీఫెన్‌సన్‌కే మళ్ళీ అవకాశం

ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న సిఎం కేసీఆర్, ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటడ్ ఎమ్మెల్యేగా మళ్ళీ స్టీఫెన్‌సన్‌కే అవకాశం కల్పించారు. తెలంగాణ శాసనసభలో ఉండే 120 స్థానాలలో 119మందిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. మిగిలిన ఒక్క స్థానాన్ని ఆంగ్లో ఇండియన్లకు కేటాయించబడింది. ఆ కోటాలో ఒక ఎమ్మెల్యేను నామినేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కనుక స్టీఫెన్‌సన్‌కే మళ్ళీ అవకాశం కల్పించారు. ఒక లేఖ ద్వారా ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ కు తెలియజేసింది. గవర్నర్ ఆమోదంతో నామినేటడ్ ఎమ్మెల్యే ఎంపిక పూర్తవుతుంది. కానీ ఆయన కూడా మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు ప్రమాణస్వీకారం చేయవలసి ఉంటుంది. ఆయనకు కూడా శాసనమండలి, రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేసే హక్కు కలిగి ఉంటారు.

ఆయనకు ఓటు హక్కు ఉన్నందునే గత ప్రభుత్వ హాయాంలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నప్పుడు నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతు కోసం టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వజూపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే.