
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. మూడు దశలలో నిర్వహించబోతున్న ఈ ఎన్నికలలో తొలి దశకు నేటి నుంచి ఈనెల 9వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటిదశలో 30 జిల్లాలోని 4,480 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబడతాయి. జనవరి 10వ తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 11న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 12న వాటిని పరిష్కరించి ఆదేరోజున నామినేషన్స్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఆదేరోజు సాయంత్రం అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటిస్తారు.
జనవరి 13 నుంచి 20వరకు అభ్యర్ధులు ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. జనవరి 21వ తేదీ సాయంత్రమే ప్రత్యక్ష పద్దతిలో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నుకొంటారు. మొత్తం 4,480 గ్రామ సర్పంచ్ పదవులు, 39,832 వార్డు సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది.