
అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 119 స్థానాలకు పోటీ చేయగా ఒకే ఒక స్థానం గెలుచుకొంది. ఘోషామహల్ నుంచి రాజాసింగ్ మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నందున, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు మజ్లిస్ పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే తాను ఆ సమయంలో శాసనసభలో అడుగుపెట్టబోనని రాజాసింగ్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. వేరెవరికైనా ఆ బాధ్యత అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మజ్లీస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే ఆయన ఎదుట తాను ప్రమాణస్వీకారం చేయనని రాజాసింగ్ ప్రకటించారు. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిననైనా ఎంపిక చేసుకునే హక్కు, అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. రాజాసింగ్ తన ఈ నిర్ణయానికి కారణం చెప్పకపోయినప్పటికీ, మత విద్వేషంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేది బహిరంగ రహస్యం. ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.
జనవరి 17 నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ నరసింహన్ ఒకరోజు ముందుగా ప్రోటెం స్పీకర్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ మరునాడు ఆయన శాసనసభ్యుల చేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. శాసనసభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమం పూర్తికాగానే ఆదేరోజున శాసనసభ స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించి నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 19వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో తొలి శాసనసభ సమావేశం జరుగుతుంది. అనావాయితీ ప్రకారం గవర్నర్ నరసింహన్ శాసనసభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ మరునాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై సభలో చర్చించి ఆమోదం తెలుపుతారు.