తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది మెదక్‌ జిల్లావాసులు మృతి

తమిళనాడులో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మెదక్‌ జిల్లాకు చెందిన 10 మంది మృతి చెందారు. వారందరూ వ్యానులో శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తమిళనాడులోని పుదుకొటై్ట్ట జిల్లా తిరుమయం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండలం పరిధిలో ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, సంగారెడ్డిలోని హత్నూర మండలంలో మంగాపూర్‌ గ్రామాలకు చెందిన 14 మంది అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వ్యానులో బయలుదేరారు. అయ్యప్పస్వామిని దర్శించుకున్న తరువాత వారు అక్కడి నుంచి రామేశ్వరం  వెళ్ళి అక్కడ రామలింగస్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. 

వారు ప్రయాణిస్తున్న వ్యాను తిరుమయం వద్దకు చేరుకున్నప్పుడు ఎదురుగా వచ్చిన ఒక కంటెయినర్ వాహనం వారి వ్యానును బలంగా డ్డీ కొట్టింది. ఆ సమయంలో వ్యానుకూడా చాలా వేగంగా వెళుతుండటంతో వ్యాను ముందుభాగమ్ అంతా నుజ్జునుజ్జయ్యింది. ఆ ధాటికి వ్యాను డ్రైవరుతో సహా 8 మంది ఘనతనస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సహాయంతో పోలీసులు మిగిలినవారిని ఆసుపత్రికి తరలించగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ఏడుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

చనిపోయిన వారి వివరాలు:  

నక్క ఆంజనేయులు (42)(రెడ్డిపల్లి),  అంబర్‌పేట క్రిష్ణగౌడ్‌ (35)(రెడ్డిపల్లి),నాగరాజు గౌడ్‌ (35), మహేశ్‌ యాదవ్‌ (25)(ఖాజీపేట), జనుముల సురేశ్‌ (23)(చిన్న చింతకుంట), చీరాల శివ సాయి ప్రసాద్‌ (22)(మంతూర్‌), అయ్యన్నగారి శ్యాంసుందర్‌గౌడ్‌ (22)(మంతూర్‌), బోయిని కుమార్‌ (21), ప్రవీణ్‌ గౌడ్‌ (21)(చిన్న చింతకుంట), సురేశ్‌ (వాహనం డ్రైవర్‌).

క్షతగాత్రులు:  శ్రీశైలం, ఎం.రాజు (మంతూర్‌), భూమాగౌడ్‌ (ఖాజీపేట), వెంకటేశ్‌ (మంగాపూర్‌).

ఈ ప్రమాదం సంగతి తెలుసుకున్న హరీష్ రావు వెంటనే పుద్దుకొట్టై కలెక్టర్‌ ఎస్‌.గణేశ్‌తో మాట్లాడి గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. సిఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ సంతాపం తెలియజేశారు. గాయపడినవారిని వీలైనంత త్వరగా హైదరాబాద్‌ తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందిస్తామని హరీష్ రావు చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నవారే.