
మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. గాంధీభవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గంపై ఆదివారం సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొన్న సర్వే సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియాలను ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధిష్టానం అనుమతితో క్రమశిక్షణ కమిటీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై సర్వే చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలే ప్రధానకారకులు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య వెంటనే రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయడం లేదు? కుంతియా, ఉత్తమ్ ఇద్దరూ కలిసి రోడ్డున పోయే అనామకులను తీసుకువచ్చి పార్టీలో కీలకపదవులు కట్టబెట్టారు. పార్టీలో కొన్ని అల్లరిమూకలు చేరాయి. వారిని నాపై ఉసిగొల్పి దాడి చేయించారు. పార్టీ సర్వనాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోవలసిందే తప్ప మాట్లాడటానికి వీలులేకుండా పోయింది. ఎవరైనా నాలాగ ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అడ్డు తొలగించుకుంటున్నారు. పార్టీలో జరుగకూడనివి చాలా జరుగుతున్నాయి. వాటన్నిటినీ త్వరలో నేను బయటపెడతాను. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ఇద్దరికీ తెలంగాణ సిఎం కేసీఆర్ తో రహస్య అవగాహన ఉంది. అందుకే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వారిరువురి తీరుపై నేను మా పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాను,” అని అన్నారు.