కొండా దంపతులకు భద్రత ఎందుకు తొలగించారు?

మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతులు తమకు భద్రత తగ్గించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను వేశారు. తమకు తమ రాజకీయ శత్రువుల నుంచి ప్రాణహాని ఉందని కానీ ప్రభుత్వం అధికార తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు, డిసెంబరు 31వ తేదీ నుంచి తమకు భద్రతను తొలగించిందని వారు పిటిషను ద్వారా న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. తమకు ఇదివరకులాగే 2+2 భద్రత కల్పించాలని వారు కోరారు. 

వారి పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు, వారికి ఎందుకు భద్రత తొలగించారో తెలియజేయాలని రభుత్వం తరపున వాదించిన ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ను ప్రశ్నించింది. ఈ నెల 21నా తదుపరి విచారణ జరిపే నాటికి కారణాలు వివరిస్తూకౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. 

కొండా సురేఖ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, ఆమె భర్త కొండా మురళీ ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికిర్ రాజీనామా చేశారు. వారిరువురూ ప్రజా ప్రతినిధులు కారు కనుకనే వారికి ప్రభుత్వం భద్రత ఉపసంహరించిందని ప్రభుత్వ న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ హైకోర్టుకు తెలియజేశారు. కానీ ఆయన వాదనలను త్రోసిపుచ్చిన హైకోర్టు కొండా దంపతులకు తక్షణం 2+2 భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.