తెలంగాణకు మరో జాతీయ అవార్డు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు తెరాస పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ గతంలోనూ మళ్ళీ ఇప్పుడూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమపధకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్రప్రభుత్వమే మెచ్చుకొంటూ అవార్డులు ఇస్తోంది. అంటే బిజెపి నేతల విమర్శలు ఎన్నికల కోసమేనని స్పష్టం అవుతోంది. 

మిషన్ కాకతీయ పధకంలో భాగంగా రాష్ట్రంలో వేలాది చెరువులు, కాలువలు పూడిక తీయించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. అవసరమైనప్పుడు ఆ చెరువుల నుంచి రైతులు తమ పంటపొలాలకు నీళ్ళు తోడుకొంటున్నారు. ఆ చెరువులలో ప్రభుత్వం కోట్లాది చేప పిల్లలు విడిచిపెట్టడంతో గ్రామాలలో మత్స్యకారులకు, గ్రామ పంచాయతీలకు వాటి వలన ఆదాయం లభిస్తోంది. ఒకే పధకం ద్వారా ఇన్ని ప్రయోజనాలు సాధించవచ్చునని నిరూపించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రప్రభుత్వ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి) కూడా ఈ పధకంయొక్క ప్రయోజనాలను, సత్ఫలితలను గుర్తించి, మిషన్ కాకతీయ పధకానికి జాతీయ అవార్డు ప్రకటించింది. నిన్న డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్యామ్‌సుందర్‌ కేంద్రమంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ నుంచి ఈ అవార్డును స్వీకరించారు. 

ఈ సందర్భంగా చీఫ్‌ ఇంజనీర్‌ శ్యామ్‌సుందర్‌ మీడియాతో మాట్లాడుతూ, “కాకతీయ రాజుల కాలంలో ఏర్పాటు చేసిన వేలాది గొలుసుకట్టు చెరువులు కాలక్రమంలో ఆక్రమణలకు గురయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్ మళ్ళీ వాటిని పునరుద్దరించాలని నిర్ణయించి, 2015 మార్చి 12న సదాశివనగర్‌లో మిషన్ కాకతీయ పధకాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ పధకం వలన కలుగుతున్న సత్ఫలితలను అధ్యయనం చేసేందుకు మిచిగాన్‌, చికాగో యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చారని చెప్పారు. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ పధకాన్ని యధాతధంగా అమలుచేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాయని తెలిపారు.