నాలుగు రోజుల క్రితమే ఏపీ హైకోర్టు విజయవాడలో కొలువు తీరింది. ఏపీ సిఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రధాన న్యాయమూర్తిని, న్యాయమూర్తులను సాధారంగా ఏపీకి ఆహ్వానించి అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. మళ్ళీ రేపటి నుంచి సంక్రాంతి పండుగయ్యే వరకు హైకోర్టుకు శలవులు మొదలవుతాయి. ఈ మూడు రోజులలలోనే ఏపీ హైకోర్టు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి మొదటి షాక్ ఇచ్చింది.
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కొన్ని రోజుల క్రితం విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాప్రయత్నంపై ఏపీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ, ఆ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.)కు అప్పగించాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది. దానిపై ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది చేసిన వాదనలను, అభ్యంతరాలను హైకోర్టు పట్టించుకోలేదు. కనుక ఇక చేసేదేమీలేక ఏపీ సర్కారు హైకోర్టు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రహోంశాఖకు లేఖ వ్రాయాలని భావిస్తోంది.
అయితే జగన్ పై హత్యా ప్రయత్నం చేసింది జగన్ అభిమానే అని టిడిపి నేతలు వాదిస్తూ దానికి అనేక రుజువులు సాక్ష్యాలు కూడా చూపినప్పుడు, ఈ కేసు దర్యాప్తును ఎన్.ఐ.ఏ.కు అప్పగిస్తే ఆందోళన చెందడం ఎందుకు? అభ్యంతరాలు ఎందుకు? అనేదే ప్రశ్న.