
హైకోర్టు విభజన జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తదితరులపై ఉన్న అన్ని కేసుల విచారణ మళ్ళీ మొదటికొస్తాయని, తద్వారా వారందరూ మళ్ళీ కొన్నేళ్ళవరకు శిక్షలు పడకుండా తప్పించుకోగలుగుతారని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఇప్పుడు నిజంగా అదే జరిగే సూచ్నాలు కనిపిస్తునాయి.
ఇన్నేళ్లుగా జగన్ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి వెంకటరమణ హైకోర్టు విభజనతో ఏపీకి కేటాయించబడ్డారు. కనుక ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన న్యాయమూర్తి జగన్, విజయసాయి రెడ్డి తదితరులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్ళీ మొదటి నుంచి ఇరు పక్షాల వాదనలు వినవలసి ఉంటుంది. ఈరోజు యధాప్రకారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణకు రాగా అది జనవరి 25వ తేదీకి వాయిదా పడింది.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టరుగా ఉన్న లక్ష్మినారాయణ, జగన్ తదితరులపై 11 ఛార్జ్-షీట్లు దాఖలు చేశారు. అప్పటి నుంచి వాటిపై సిబిఐ కోర్టులో నేటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగున్నరేళ్ళలో కేవలం 4 కేసులలో మాత్రమే వాదనలు పూర్తయ్యాయంటే మిగిలిన 7 కేసులలో వాదనలు పూర్తవడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో ఊహించలేము. ఈ సమయంలో కొత్తగా వచ్చిన న్యాయమూర్తి 11 కేసులలో మళ్ళీ మొదటి నుంచి వినాలనుకుంటే, వాటి విచారణ ముగిసి తీర్పు వెలువరించడానికి మరో 10-15 ఏళ్ళు పట్టవచ్చు. అంటే హైకోర్టు విభజన వలన జగన్మోహన్ రెడ్డి తదితరులకు చాలా ఉపశమనం లభించినట్లు స్పష్టం అవుతోంది.