
కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ వ్రాశారు. అసెంబ్లీ ఎన్నికలలో అనేక అవకతవకలు జరిగాయని కనుక విచారణకు ఆదేశించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాభిప్రాయానికి భిన్నంగా అంతా కేసిఆర్ చెప్పినట్లుగానే ఫలితాలు వెలువడ్డాయని ఆరోపించారు. ఎక్కడ ఎంత మెజార్టీ లభిస్తుంది..ఎవరెవరు గెలువబోతున్నారో ఎవరెవరు ఓడిపోతారో అన్నీ కేసిఆర్ చెప్పినట్లుగానే జరిగిందని, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అనేక చోట్ల ఈవీఎం ట్యాంపరింగ్ జరుగగా, కొన్ని చోట్ల ఈవిఎంలలో పోలైన ఓట్లకు, వివి ప్యాట్లలో రసీదులకు లెక్క సరిపోలేదని పొన్నాల ఆరోపించారు. ఎన్నికలకు ముందు లక్షలాది ఓటర్ల పేర్లు గల్లంతవడం, చనిపోయిన వారి పేరున ఓట్లు పోల్ అవడం వంటి అనేక అవకతవకలు జరిగాయని పొన్నాల ఆరోపించారు. వీటన్నిటి గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి ఫిర్యాదు చేద్దామనుకున్నప్పటికీ కలువలేకపోవడంతో ఆయనకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశానని పొన్నాల చెప్పారు. అయితే ఇటువంటి లేఖలు, ఫిర్యాదులు చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయని అందరికీ తెలుసు. కనుక కాంగ్రెస్ నేతలు ఇటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ సమయం వృధా చేసుకొనే బదులు పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల గురించి ఆలోచిస్తే వారికే మంచిది.