రూ.2,000 నోట్లు ముద్రణ నిలిపివేత?

2016 నవంబరులో పెద్ద నోట్లరద్దు తరువాత కేంద్రప్రభుత్వం కొత్తగా రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టింది. నోట్లరద్దుతో దేశంలో నల్లధనం వెలికి తీయాలనుకుంటే, అదంతా ఈ కొత్త పెద్దనోట్లలోకి మారిపోయి మళ్ళీ భద్రంగా ఇనపెట్టెలలోకి వెళ్లిపోయింది. ఇటీవల ఎన్నికల సమయంలో అది కొంత బయటకు వచ్చింది లేకుంటే దేశంలో రూ.2,000 నోట్లు మళ్ళీ కనబడి ఉండేవి కావేమో. రూ.2,000 నోట్ల వలన సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు కానీ బాడాబాబులకు తమ నల్లధనం దాచుకోవడం మరింత తేలికైంది. పైగా రూ.2,000 నోట్లలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి కనుక వాటికి నకిలీలు ముద్రించడం కష్టం అని కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ గొప్పలు చెప్పుకొన్నప్పటికీ వాటికీ నకిలీలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక ఈ పెద్ద నోట్లతో మనీలాండరింగ్ కూడా సులువైంది.

కనుక ఈ సమస్యలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేయాలని కేంద్రప్రభుత్వం రిజర్వ్ బ్యాంకును కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లలో చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించబోవడం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కనుక ప్రజలెవరూ భయాందోళనలు చెందనవసరం లేదని స్పష్టం చేసింది. అయితే రూ.2,000 నోట్ల వలన ప్రయోజనాల కంటే అనర్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక రిజర్వ్ బ్యాంక్ వాటిని మెల్లమెల్లగా మార్కెట్ల నుంచి ఉపసంహరించుకొన్నా ఆశ్చర్యం లేదు.