
మళ్ళీ ఐదేళ్ళ వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండవు కనుక కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్న తెరాసలో చేరిపోవాలనుకుంటే ఆశ్చర్యమేమీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వచ్చిన సిఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ, దుద్దిళ్ళ సుధీర్ బాబు నిన్న కలిశారు. కానీ తాము తెరాసలో చేరడానికి ఆయనను కలవలేదని నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడేందుకు కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. వారి తరువాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ తెరాసలో చేరబోతున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆయన ఖండించారు. తాను తెరాసలో చేరడం లేదని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ట్వీట్ ద్వారా ప్రకటించారు.
నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరే ప్రయత్నాలు చేస్తున్నందునే మీడియాలో అటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. తెరాసలో చేరిక ఖరారు అయ్యేవరకు వారు వాటిని ఖండిస్తూనే ఉంటారు. ఒకటి రెండు నెలలోపుగానే కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది హ్యాండ్ ఇచ్చి గులాబీ కారు ఎక్కుతారో తేలిపోవచ్చు.