కాళేశ్వరం పనులను పరిశీలిస్తున్న సిఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ మంగళవారం ముందుగా హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పనులను ఏరియల్ సర్వే చేసిన తరువాత ప్రాజెక్టు అధికారులు, ఇంజనీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను పూర్తి చేయడానికి ఏప్రిల్ 15 వరకు గడువు విధించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజీ నిర్మాణపనులతో పాటు పంపుహౌస్ నిర్మాణపనులు, వాటిలో మోటార్ల బిగించే పనులు అన్నీ ఏకకాలంలో సమాంతరంగా చేయాలని అప్పుడే అనుకొన్న సమయానికి ప్రాజెక్టులు పూర్తయి సకాలంలో రైతులకు నీళ్ళు అందించగలుగుతామని సిఎం కేసీఆర్ చెప్పారు. 

మేడిపల్లి నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొన్న సిఎం కేసిఆర్ పంప్‌హౌస్‌లో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 11 మోటర్లు బిగించవలసి ఉండగా 4 ఇప్పటికే బిగించడం పూర్తవడంపై సిఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 7 మోటర్లను మార్చి నెలాఖరులోగా బిగించి ట్రయల్ రన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఇక నుంచి సిఎంఓలో ఒక ప్రత్యేక కార్యదర్శి ఈ ప్రాజెక్టు పనులను నిత్యం పర్యవేక్షిస్తుంటారని సిఎం కేసీఆర్ చెప్పారు. ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే ఆ కార్యదర్శితో చర్చించుకొని పనులు ఆగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

నిన్న రాత్రి కరీంనగర్‌లోని తీగలగుట్ట గెస్ట్ హౌసులో బస చేసిన సిఎం కేసీఆర్, ఇవాళ్ళ ఉదయం  జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నారం బ్యారేజీ చేరుకొని కు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు.