
రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్ధి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు. కానీ పార్టీలో అందరి కంటే ముందుగా ఆ ఓటమి షాక్ నుంచి తేరుకొని మళ్ళీ తెరాసతో యుద్దం ప్రారంభించారు. ఆయన ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు న్యూఇయర్ గిఫ్ట్ గా పెద్ద ప్రమోషన్ ఇచ్చింది. ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా కల్పించింది.
కనుక ఇకపై ఆయన తెరాసపై ఫోకస్ తగ్గించి జాతీయ రాజకీయాలపై మాట్లాడుతారేమో? పార్టీలో గట్టిగా మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఓటమి కారణంగా అస్త్రసన్యాసం చేసినట్లు పార్టీకి, మీడియాకు దూరంగా ఉంటున్నందున ఇదివరకులా రాష్ట్రంలో కాంగ్రెస్ గొంతులు పెద్దగా వినిపించడంలేదు. ఒకవేళ దాసోజు శ్రావణ్ కుమార్ కూడా జాతీయ రాజకీయాలకు మారితే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున గట్టిగా మాట్లాడేవారే ఉండకపోవచ్చు. అయితే కేసిఆర్ కూడా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నారు కనుక దాసోజు ఆయనపై దృష్టి పెట్టి మాట్లాడతారేమో?