
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల
ఉమ్మడి హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనూహ్యమైన
వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,“ఇంత
హడావుడిగా హైకోర్టు విభజన చేయడం వెనుక కారణాలు ఏమిటో తెలియడం లేదు. నాలుగు రోజులు
సమయం ఇచ్చి హైకోర్టును అమరావతికి తరలించాలని ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు.
ఇప్పటికిప్పుడు ఏపీ న్యాయవాదులందరినీ అమరావతికి తరలిపోమ్మంటే ఎలా సాధ్యం? కనీసం నెలరోజులైనా గడువు ఇచ్చి ఉండాల్సింది. అయినా హైకోర్టు విభజన
చేస్తున్నప్పుడు దాని తరలింపుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయవలసిన మాకు ముందుగా ఒక
మాట చెప్పి ఉండాలి కదా?
ఈ
హడావుడి నిర్ణయం వెనుక ఏమైనా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది.
ఇంత హటాత్తుగా హైకోర్టు విభజిస్తే జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ జరుపుతున్న
నాంపల్లి కోర్టు న్యాయమూర్తులు కూడా మారుతారు. అనేక ఏళ్ళుగా విచారణ సాగుతున్న జగన్
కేసులు ఇప్పుడిప్పుడే తుది దశకు చేరుకొంటున్నాయి. కానీ హైకోర్టు విభజనతో నాంపల్లి
కోర్టు న్యాయమూర్తులు మారుతారు కనుక ఆ కేసులన్నీ మళ్ళీ మొదటికొస్తాయి. కనుక
జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకే ఇంత హడావుడిగా హైకోర్టు విభజిస్తున్నారా? అనే అనుమానం
కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు విభజన, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఫైళ్ళు తరలింపు,
కేసుల బదలాయింపు ప్రక్రియకు కనీసం నెలరోజులు సమయం ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది,” అని అన్నారు.