తెరాస ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందా?

అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ప్రభంజనం తట్టుకొని గెలిచిన అతికొద్దిమందిలో టిడిపికి చెందిన మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. వారిలో మెచ్చా ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట నుంచి, సండ్ర సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

 అయితే ఎన్నికలలో ప్రజాకూటమి ఓడిపోవడంతో రాష్ట్రంలో టిడిపి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కనుక వారిరువురూ తెరాసలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వారివురూరూ తమ అనుచరులతో సమావేశమయ్యి దీనిపై చర్చించారు కూడా. వారిలో సండ్ర వెంకటవీరయ్య తెరాసలో చేరేందుకు సిద్దపడుతున్నప్పటికీ, మెచ్చా నాగేశ్వరరావు మాత్రం టిడిపిలోనే కొనసాగాలని నిశ్చయించుకున్నారు. 

 శుక్రవారం చంద్రుగొండ మండలంలో అయ్యన్నపాలెం గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు విలేకరులతో మాట్లాడుతూ, “నేను తెరాసలో చేరుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం కావు. నాకు తెరాస ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినా సరే తెరాసలో చేరను. ఎందుకంటే ప్రజలు నన్ను టిడిపి అభ్యర్ధిగా ఎన్నుకున్నారు. నేను తెరాసలో చేరితే వారి నమ్మకాన్ని వమ్ముచేసినట్లవుతుంది. తెరాసలో చేరకపోతే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు రావనేది అపోహ మాత్రమే. సిఎం కేసీఆర్‌ అటువంటి భేదభావం చూపకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సమానంగానే నిధులు మంజూరు చేస్తారనే భావిస్తున్నాను. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఆయనతోనే మాట్లాడి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించుకొంటాను. రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ నియోజకవర్గంలోని ప్రజలు నన్ను నమ్మి గెలిపించినందుకు నేను ఎల్లపుడూ వారికి అందుబాటులోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను,” అని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు.