తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టిబి రాధా కృష్ణన్

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న టిబి రాధాకృష్ణన్   తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ మరియు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్ ఇదరూ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా కొనసాగుతారని తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ నియామకాలు జనవరి 1, 2019 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. అదే రోజునుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు పనిచేయడం మొదలుపెడుతుందని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ను సంప్రదించి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తెలియజేసింది.