ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆసరా పెన్షన్లు

మళ్ళీ తెరాస అధికారంలోకి రాగానే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వివిద పెన్షన్లు రెట్టింపు చేస్తామని తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకొంటూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి బుదవారం సచివాలయంలో సంబందిత శాఖల అధికారులతో సమావేశమయ్యి చర్చించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వృద్ధాప్య, వికలాంగులకు పెంచిన పెన్షన్లను అందజేయడానికి అర్హులను గుర్తించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవాళ్ళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం నిర్వహించి వారికి కూడా వీటికి సంబందించి ఆదేశాలు ఇవ్వనున్నారు. 

గతంలో 65 ఏళ్ళు ఆపైన వయసున్న వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్లకు అర్హులుగా ఉండేవారు. కానీ ఈసారి 57 ఏళ్ళు ఆపైన వయసున్న వారందరూ అర్హులే. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది అర్హులైన వృద్ధులు ఉన్నట్లు సమాచారం. వీటిని పొందేందుకు వయోపరిమితిని తగ్గించినందున కొత్తగా దరఖాస్తు చేసుకొనేవారి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, విధివిధానాలు జారీ చేసింది.

గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టర్లు కొత్తగా దరఖాస్తు చేసుకొన్నవారి వివరాలను సేకరించి దృవీకరించి కలెక్టర్లకు అందజేస్తారు. వాటిని జిల్లా కలెక్టర్లు మరోసారి పరిశీలించి అర్హులైన వారి పేర్లను ప్రభుత్వ డాటా బేస్ లోకి ఎక్కిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేలోగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆసరా పెన్షన్ల కోసం నిధులు కేటాయింపు జరుగుతుంది కనుక ఏప్రిల్ 1వ తేదీ నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోకి ఆసరా పెన్షన్లు జమా అవుతాయి. వృద్ధులు, వికలాంగులకు పెరిగిన ఈ పెన్షన్లు చాలా ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. 

కొత్త పెన్షన్ల వివరాలు: 

వృద్ధాప్య పింఛన్లు: నెలకు రూ. 2,016 (గతంలో నెలకు రూ. 1,000 ఉండేది).

వికలాంగులకు పింఛన్లు: నెలకు రూ.3,016 (గతంలో నెలకు రూ. 1,500 ఉండేది).

వృద్ధాప్య పింఛన్లకు అర్హతలు, అనర్హతలు:  

1. ఈ పెన్షన్ పొందేందుకు ఓటరు కార్డులో పేర్కొన్న వయసును ప్రామాణికంగా తీసుకోబడుతుంది. 

2. 1953-1961 మద్య జన్మించి ఉండాలి. 

3. 57 ఏళ్ళు దాటినవారెవరైనా అర్హులే. 

4. 3ఎకరాలు మాగాణీ భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్టభూమి ఉన్నవారు దీనికి అనర్హులు. 

5. గ్రామాలలో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, నగరాలలో రూ.2.0 లక్షలకు మించి ఉన్నవారు దీనికి అనర్హులు. 

6. వైద్యులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, ఇతర వృత్తులలో అధిక ఆదాయం ఉన్నవారి తల్లితండ్రులు ఈ పధకానికి అనర్హులు. 

7. ఎటువంటి పెద్ద వ్యాపారాలున్నవారు దీనికి అనర్హులు. 

8. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు, ఇతర పధకాలలో లబ్ధిపొందుతున్నవారు దీనికి అనర్హులు. 

9. ఐ‌టి రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారు, సొంత వాహనాలున్నవారు దీనికి అనర్హులు. 

10. ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగుల తల్లితండ్రులు దీనికి అనర్హులు.     

 ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలంటే... 

1. గ్రామాలలో నివసిస్తున్నవారైతే వీఆర్వోలకు, పట్టణాలలో బిఎల్ఎఫ్ కలెక్టర్లకు దరఖాస్తు అందజేయవలసి ఉంటుంది. వారికే ఆధార్, బ్యాంక్ తదితర వివరాలను అందజేయవలసి ఉంటుంది.  

2. ఎంపిక చేసిన లబ్దిదారుల ముసాయిదా జాబితాను ముందుగా గ్రామ లేదా వార్డు సభలలో ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 

3. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను కలెక్టర్లకు పంపుతారు.

4. లబ్ధిదారుల తుది జాబితాను ఎంపీడీవో లేదా మున్సిపల్‌ కమిషనర్లు ప్రస్తుతమున్న ‘ఆసరా’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 

5. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అర్హులైన వృద్ధులకు నెలకు రూ.2,016, అర్హులైన వికలాంగులకు నెలకు రూ.3,016 చొప్పున ప్రతీనెలా వారివారి బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమా చేయబడుతుంది.