
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై, సిఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడగా, రాష్ట్ర ఎన్నికల సంఘం దానిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించి ఎన్నికలలో ప్రధమ ముద్దాయిగా నిలిచిందని దయాకర్ ఆరోపించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడి రెండువారాలు గడిచినా సిఎం కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీని సమావేశపరిచి కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించకుండా, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలలో మహిళల ఓట్ల కోసం హడావుడిగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు పధకం గురించి గొప్పలు చెప్పుకొన్న తెరాస ఇప్పుడు రైతులకు చెల్లించవలసిన రూ.500 కోట్ల బకాయిలను చెల్లించలేకపోయిందని దయాకర్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంది. సెప్టెంబరు 6న అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళినప్పటి నుంచి రాష్ట్రాన్ని అధికారులే నడిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 2 వారాలైనప్పటికీ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంతో నేటికీ అధికారులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమైన ఈ రెండు పనులు చేయకుండా ఇప్పుడు అవసరంలేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం సిఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక ఇకనైనా ఈ రెండు ముఖ్యకార్యక్రమాలు పూర్తి చేస్తే బాగుంటుంది.