
తెలంగాణ ఏర్పడక మునుపు 5 మెడికల్ కాలేజీలు ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వం కృషితో కొత్తగా మహబూబ్‌నగర్, సిద్ధిపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రి, దానికి అనుబందంగా ఒక మెడికల్ కాలేజీ రాబోతోంది. ఇవిగాక సూర్యాపేట, నల్లగొండలో ఏర్పాటయిన మెడికల్ కాలేజీలో వచ్చే ఏడాది నుంచి విధ్యార్ధులను చేర్చుకొని తరగతులు ప్రారంభించడానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇవికాక కొత్తగా మరో 7 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికలలో గెలిచి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కనుక తాండూరు, జగిత్యాల, జనగాం, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వనపర్తి, రామగుండంలో ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు ఏర్పాటుపై సిఎం కేసీఆర్ దృష్టి పెట్టారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలలో కలిపి మొత్తం 1,050 ఎంబీబిఎస్ సీట్లున్నాయి. నల్గొండ, సూర్యాపేట, బీబీనగర్ మెడికల్ కాలేజీలు ప్రారంభమయితే మరో 400 ఎంబీబిఎస్ సీట్లు వస్తాయి. సిఎం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించి మరో ఏడు కొత్త కాలేజీలు కూడా వస్తే అప్పుడు రాష్ట్రంలో 2,650 ఎంబీబిఎస్ సీట్లు వస్తాయి.
అయితే సిఎం కేసీఆర్ ఇంతకాలం కేంద్రంతో చాలా సఖ్యతగా ఉన్నందున ఇవన్నీ సాధించగలిగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బిజెపీలకు సవాలు విసురుతూ జాతీయకూటమిని ఏర్పాటు చేయాలనుకొంటున్నారు కనుక కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.