కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తా: కే.ఏ.పాల్‌

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి కే.ఏ.పాల్‌. అమెరికా అధ్యక్షుడు మొదలు ప్రధాని నరేంద్రమోడీ వరకు అందరితో తనకు పరిచయాలున్నాయని అందరినీ తను కలుస్తుంటానని...వారందరూ తన సలహాలు సూచనలు తీసుకొంటుంతారని గొప్పలు చెప్పుకొంటుంటారు. అవి విని ప్రజలు హాయిగా నవ్వుకొంటుంటారు. తన మాటలు నిజమని నిరూపిస్తున్నట్లుగా ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ తో కలిసి మంగళవారం సాయంత్రం డిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

ఆయన అధ్యక్షతన ప్రజాశాంతి అనే పార్టీ ఒకటి కొంతకాలం క్రితం స్థాపించారు. వచ్చే ఏడాది ఏపీలో జరుగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని కే.ఏ.పాల్‌ ప్రకటించారు. ఈనెల 29న  విశాఖపట్నంలో తమ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తానని చెప్పారు. ఇక నుంచి ఎన్నికల వరకు ఏపీలో విస్తృతంగా పర్యటించి ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల గురించి త్వరలోనే ఆ పార్టీ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. ఏపీలో మరో ఆరు పార్టీలతో పొత్తుల గురించి చర్చలు సాగుతున్నాయని చెప్పారు. ఏపీలో ప్రజలు దయనీయ పరిస్థితులలో ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించి రాష్ట్రాభివృద్ధి చేయడం కోసమే ప్రజాశాంతి పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అవుతోందని కే.ఏ.పాల్‌ చెప్పారు.