భారతదేశంలోకెల్లా అత్యంత పొడవైన ‘బోగీనీల్ రైల్-కామ్-రోడ్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ వంతెన అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ బ్రహ్మపుత్రానదిపై నిర్మించబడింది.
రూ.5,900 కోట్ల వ్యవయంతో నిర్మించబడిన ఈ బ్రిడ్జి పొడవు 4.94 కిమీ. దేశంలో ఉన్న రైల్-కామ్-రోడ్ బ్రిడ్జిలలో ఇదే అత్యంత పొడవైనది. రైల్వే బ్రిడ్జిపై మూడు వరుసలతో విశాలమైన రోడ్డునిర్మించబడింది. దీని వలన అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మద్య రోడ్డు ప్రయాణానికి సుమారు 4 గంటలు తగ్గుతుంది. అదేవిధంగా దీని వలన డిబ్రూగఢ్ నుంచి ఈటానగర్ మధ్య ప్రయాణదూరం రోడ్డు మార్గంలో 150 కిమీ, రైలుమార్గంలో 705 కిమీ తగ్గుతుంది
ఈ రైల్-కామ్-రోడ్ బ్రిడ్జిని ప్రారంభించిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ దానిపై పయనించి బ్రిడ్జికి అవతలి వైపుకు చేరుకొని ఆ బ్రిడ్జిపై పయనించే మొట్టమొదటి రైలు టిన్సుకియా–నహర్లాగున్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది అస్సాంలోని టిన్సుకియా- అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్లాగున్ మద్య తిరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రైలు ప్రయాణసమయం గతంతో పోలిస్తే 10 గంటలు తగ్గుతుంది.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి 1997లో హెచ్.డి.దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శంఖుస్థాపన చేశారు. కానీ 2002 ఏప్రిల్ 1వరకు పనులు ప్రారంభం కాలేదు. అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీని నిర్మాణపనులు చాలా చురుకుగా సాగాయి. కానీ ఆ తరువాత కాంగ్రెస్ హయాంలో మళ్ళీ నత్తనడకలు నడిచినందున రూ.3,230.02 కోట్ల నిర్మాణవ్యయంతో పూర్తికావలసిన ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం ఏకంగా రూ. 5,960 కోట్లకు పెరిగిపోయింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో చిరకాలంగా నత్తనడకలు నడుస్తున్న ఇటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేకశ్రద్ద పెట్టడంతో వాటిలో భాగంగా ఈ బ్రిడ్జికి కూడా మోక్షం లభించింది. అప్పటి నుంచే దీని నిర్మాణపనులు యుద్దప్రాతిపాదికన ఉరుకులు వేస్తూ చురుకుగా సాగడంతో నేటికి పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్, అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖి తదితరులు పాల్గొన్నారు.