హైకోర్టులో కాంగ్రెస్ పంచాయతీ

పంచాయతీ ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషను వేసింది. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతోందని, ఇది కోర్టు ధిక్కారమేనని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, బి.రవీంద్రనాథ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కనుక బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా వారు హైకోర్టును కోరారు. 

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌ రాజ్, ఆ శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, గణాంకాల డైరెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి సైదా మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ధర్మారెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

పంచాయతీ ఎన్నికలపై మరో పిటిషను కూడా దాఖలైంది. ఈ ఎన్నికలలో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్‌ రాజు కలిసి మరో పిటిషను వేశారు. 

ఈ పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసును 2 వారాలకు వాయిదా వేశారు.