ఈనెలాఖరులోగా తెలంగాణ మంత్రివర్గం ఏర్పాటు

ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వీలైనంత త్వరగా మంత్రివర్గం ఏర్పాటవుతుంది కనుక మంత్రిపదవులను ఆశించేవారి హడావుడి కనిపిస్తుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంత్రివర్గం ఏర్పాటుపై తెరాసలో ఎటువంటి హడావుడి కనిపించడం లేదు. డిసెంబరు 12న కేసీఆర్‌, మహమూద్ అలీ ముఖ్యమంత్రి, హోంమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి తెరాసలో ఎవరూ మంత్రివర్గం ఏర్పాటు గురించి కానీ మంత్రిపదవుల గురించి గానీ మాట్లాడకుండా అందరూ నిశబ్ధంగా ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

కాంగ్రెస్, టిడిపిల నుంచి కొంతమంది ఎమ్మేల్యేలు తెరాసలో చేర్చుకోవడానికి సంప్రదింపులు జరుగుతున్నాయని, వారిలో ఒకరిద్దరికి మంత్రిపదవులు ఈయవలసి ఉంటుంది కనుక వారు కూడా తెరాసలో చేర్చుకొన్న తరువాతనే మంత్రివర్గం ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ తెరాసలో ఎవరూ మౌనం వీడటం లేదు.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈనెలాఖరులోగా తెలంగాణ మంత్రివర్గం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. కనుక త్వరలోనే కొత్తమంత్రివర్గం ఏర్పాటుకాబోతోందని భావించవచ్చు.