
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ వెళ్ళి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయకూటమి ఏర్పాటు గురించి చర్చించారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడారు.
ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ, “దేశప్రయోజనాల ఏవిధంగా కాపాడుకోవాలనే దానిపై మేము ప్రధానంగా చర్చించాము. కూటమి ఏర్పాటు గురించి ప్రాధమిక స్థాయిలో చర్చించాము. పార్లమెంటు ఎన్నికల గురించి ఆలోచించడానికి ఇంకా సమయం ఉంది కనుక వాటి గురించి చర్చించలేదు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ చేపడుతున్న పధకాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఆయన ప్రతిపాధనకు నేను మద్దతు ఇస్తున్నాను,” అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, “దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడం కోసమే నేను ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అందుకోసం దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావలసి ఉంది. అన్నిటినీ ఏకత్రాటిపైకి తీసుకురాగలిగితే, దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తి ఏర్పడుతుంది. కూటమి ఏర్పాటు గురించి దేశంలో ముఖ్యనేతలందరితో చర్చించవలసి ఉంది. నవీన్ పట్నాయక్ దేశంలో కెల్లా సీనియర్ ముఖ్యమంత్రి. మంచి అనుభవమున్నవారు. ఆయనతో చర్చలు సానుకూలంగా సాగాయి. ఈరోజు జరిగినవి ప్రాధమిక స్థాయి చర్చలు మాత్రమే కనుక త్వరలో మళ్ళీ మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించుకొన్నాము,” అని చెప్పారు.
ఈసందర్భంగా భువనేశ్వర్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “తెలంగాణ అస్సెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు మా పార్టీని కాంగ్రెస్ పార్టీకి ‘బీ-టీం’ అని అభివర్ణించారు. అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మా పార్టీని బీజేపీకి ‘బీ-టీం’ అని అభివర్ణించారు. కానీ మార్టీ ఏ పార్టీకి తోకపార్టీ కాదు. మా పార్టీ ప్రజల పార్టీ. ప్రజాప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతుంటుంది,” అని సిఎం కేసీఆర్ అన్నారు.