
కొండా మురళి శనివారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్వయంగా మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెరాసనువీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నాకు షోకాజ్ నోటీసు పంపబోతున్నట్లు తెలుసుకొని, అటువంటి అవసరం లేకుండా నైతిక విలువలకు కట్టుబడి నేనే నాపదవికి రాజీనామా చేశాను. తెరాస ఎమ్మెల్సీలకు ఒక నీతి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మరోనీతి పాటిస్తుండటం శోచనీయం. కాంగ్రెస్‌లో చేరిన మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్దపడిన మండలి చైర్మన్, తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారిని తెరాసలో విలీనం చేసేందుకు ఎందుకు అంగీకరించారు? మండలిలో ప్రతిపక్షసభ్యులు లేకుండా చేయాలనే తెరాస ఆలోచన అప్రజాస్వామికం,” అని అన్నారు.