
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల అభ్యర్ధనను మండలి ఛైర్మన్ ఆమోదించడంతో వారిని తెరాస సభ్యులుగా గుర్తిస్తున్నట్లు తెలియజేస్తూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు శుక్రవారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షహోదా కోల్పోయింది. కనుక ఇకపై షబ్బీర్ ఆలీ, పొంగులేటి సుధాకర్ ఇద్దరూ కేవలం మండలి సభ్యులుగా మాత్రమే పరిగణింపబడతారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దం అవుతోంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్వామి గౌడ్ నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలుచేయకుండా తెరాస ప్రతినిధిగా వ్యవహరించారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్ని తమ పార్టీ పార్లమెంటులో కూడా లేవనెత్తి, పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకువెళుతుందని చెప్పారు.