ఎయిమ్స్ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్) ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఆమోదముద్ర వేశారు. ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన పధకంలో భాగంగా రూ.1,028 కోట్ల వ్యయంతో 228 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో 960 పడకలు, 42 సూపర్ స్పెషాలిటీ విభాగాలు కలిగి ఉంటుంది. ఈ మెడికల్ కాలేజీ కోటాలో 100 మెడికల్ సీట్లు ఉంటాయి. ఈ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ద, ప్రకృతి వైద్య సేవలు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇప్పటికే అక్కడ నీమ్స్ ఆసుపత్రికి చెందిన కొన్ని సువిశాలమైన భవనాలు కలిగి ఉండటంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.