
ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు డెమూ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి కాచిగూడ స్టేషన్ నుంచి మరొకటి సికింద్రాబాద్ నుంచి నడుస్తున్నాయి. త్వరలో అవి గజ్వేల్ వరకు పొడిగించబడనున్నాయి.
ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32కిమీ రైలు మార్గంలో గిరిపల్లి వరకు 25కిమీ పొడవునా రైల్వే లైన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన మార్గంలో గజ్వేల్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణపనులు మొదలయ్యాయి. మార్చిలోగా వాటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని రైల్వే సిబ్బంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మనోహరాబాద్-గజ్వేల్ రైల్వే మార్గం సిద్దం అయినట్లే.
అప్పుడు ట్రయల్ రన్స్ నిర్వహించి, కమిషన్ ఆఫ్ రైల్వేసేఫ్టీ (సీఆర్‌ఎస్) ఆమోదం పొందితే హైదరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైలు సేవలు ప్రారంభం అవుతాయి. ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు మరో 4-5 నెలలు పట్టవచ్చని రైల్వే అధికారులు చెపుతున్నారు. అంటే వచ్చే ఏడాది మే నెలాఖరులోగా గజ్వేలుకు రైలు బండి వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు.
మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు మొత్తం 151.36 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు నాలుగు దశలుగా విభజించబడింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెటులో రూ.125 కోట్లు కేటాయించింది. దానిలో ఇప్పటి వరకు రూ.117 కోట్లు ఖర్చు చేసింది. మనోహరాబాద్-గజ్వేల్ మొదటిదశ పనులకు 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేశారు.
గజ్వేల్ వరకు రైల్వే లైన్ పూర్తయిన తరువాత రెండవ దశలో గజ్వేల్-దుద్దెడ, ఆ తరువాత దుద్దెడ-సిద్ధిపేట పనులు మొదలవుతాయి. వీటిని 2020 లోగా పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. చివరిదశలో సిద్ధిపేట నుంచి కొత్తపల్లి వరకు రైల్వేలైన్ నిర్మాణం చేస్తారు. ఇది 2022 మార్చి నాటికి పూర్తయే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం, గజ్వేల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ మార్గంలో రైల్వే లైన్ నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి.