
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్రంలో 9,335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి అక్టోబరు 10వ తేదీన వ్రాత పరీక్షలు నిర్వహించగా సుమారు 4.5 లక్షల మంది వాటికి హాజరయ్యారు. అయితే పరీక్షల నిర్వహణ మొదలు నియామకాల వరకు ఎక్కడా పారదర్శకత లేకుండా అధికారులు ముందుకు సాగుతున్నారని, నిబందనలను పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా నియామకాలకు సిద్దం అవుతున్నారని, కనుక ఈ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా చెందిన హరీశ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వారి పిటిషనుపై బుదవారం విచారణ జరిపినప్పుడు పిటిషనర్ల తరపున వాదించిన రాహుల్ రెడ్డి కొన్ని అవకతవకలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళారు.
1. ప్రాధమిక కీ పై 70,000 మంది అభ్యర్ధులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
2. తుది కీ, అభ్యర్ధుల మార్కులు, ర్యాంకులు విడుదల చేయకుండానే ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను ప్రకటించారు.
3. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదు. కానీ అధికారులు ఆ పరిమితిని పట్టించుకోకుండా నియామకాలు చేశారు.
పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనలను విన్న జస్టిస్ రామచంద్రరావు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టుల భర్తీలో నియమనిబందనలను పట్టించుకోకుండా నియమకాలు చేపట్టడాన్ని తప్పు పట్టారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ పోస్టుల భర్తీకి సంబందించి నియామకాలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులలోగా దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.