
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ప్రభంజనాన్ని తట్టుకొని ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వరులు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియా నాయక్‌లు మంగళవారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస నేతలు డబ్బు, మద్యం పంచిపెట్టి జిల్లా ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినపటికీ వాటికి లొంగకుండా మమ్మల్ని గెలిపించారు. జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతమైన తీర్పు నిచ్చి తెరాసకు మంచి గుణపాఠం చెప్పారు. అందుకు జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ మేము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గాల అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో…ఆ తరువాత జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాము,” అని చెప్పారు.
ఖమ్మం జిల్లా ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చిన మాట వాస్తవం. అయితే అసెంబ్లీ ఎన్నికలలో తెరాస విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది కనుక ఇకపై జరుగబోయే అన్ని ఎన్నికలలో జిల్లా ప్రజలు తెరాస వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించినప్పటికీ వారిలో కొందరు అప్పుడే తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఏకంగా తెరాస అభ్యర్ధులనే గెలిపిస్తే ఈ ఫిరాయింపులు ఉండవు...అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు సజావుగా సాగుతాయని ప్రజలు భావించడం సహజం. కనుక పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంత సులువేమీ కాదనే చెప్పవచ్చు.