ఆస్ట్రేలియాలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి

ఆస్ట్రేలియాలో ఇద్దరు తెలంగాణవాసులు ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి చనిపోయారు. మరొకరు గల్లంతయ్యారు. 

ప్రాధమిక సమాచారం ప్రకారం నల్గొండకు చెందిన గౌసుద్దీన్‌ (45), అతని మేనల్లుడైన జువేద్‌ (26), వారి సమీప బందువు రాహేత్‌ (35) ముగ్గురూ సిడ్నీలో ఉంటున్నారు. వారిలో గౌసుద్దీన్‌ సిడ్నీలో ఉద్యోగం చేస్తూ అక్కడే తన భార్య, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. జువేద్‌ ఎంఫార్మసీ చదువుతూ సిడ్నీలోనే పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్నాడు. రాహేత్‌ బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్టు పని మీద సిడ్నీకి వచ్చి పనిచేస్తున్నాడు. క్రిస్మస్ శలవులు కావడంతో వారందరూ కలిసి ఆదివారం న్యూ సౌత్‌వెల్స్‌లోని మోనో బీచ్‌కు వెళ్లారు. 

గౌసుద్దీన్, జువేద్, రాహేత్‌ ముగ్గురూ సరదాగా స్పీడ్ బోటులో సముద్రంలో షికారు చేసేందుకు వెళ్లినప్పుడు వారికి కొంత దూరంలో మరో పడవలో ఒక కుటుంబం సముద్రంలో చిక్కుకొని సహాయం కోసం కేకలు వేస్తుండటం కనబడింది. వారిని కాపాడేందుకు ముగ్గురూ సముద్రంలోకి దిగారు. వారిని కాపాడే ప్రయత్నంలో గౌసుద్దీన్, రాహేత్‌ ఇద్దరూ సముద్రంలో మునిగి చనిపోగా జువెద్ గల్లంతయ్యాడు. 

వారిలో గౌసుద్దీన్‌ తల్లితండ్రులు నల్గొండ పట్టణంలో మాన్యంచెల్కలో, జువెద్ కుటుంబ సభ్యులు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గౌసుద్దీన్‌ తండ్రి సబ్జద్‌ అలీ ఎస్సైగా పదవీ విరమణ చేశారు. జువేద్‌ తండ్రి రషీద్‌ రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. పిల్లలు చక్కగా చదువుకొని విదేశాలలో ఉన్నతోద్యోగాలు చేసుకొంటూ జీవితంలో స్థిరపడ్డారని సంతోషిస్తున్న వారి తల్లితండ్రులు ఈవార్త తెలిసినప్పటి నుంచి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి భౌతికకాయలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారత విదేశాంగశాఖ ద్వారా ప్రయత్నిస్తోంది.