ఏపీని స్తంభింపజేసిన పెథాయ్‌

పెథాయ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు స్తంభింపజేసింది. ముఖ్యంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు జిల్లాలలో పెథాయ్‌ తుపాను తాకిడికి జనజీవనం స్తంభించిపోయింది. తుఫాను ప్రభావం కారణంగా ఏపీఎస్ ఆర్టిసి 775 సర్వీసులను నిలిపివేసింది. ముఖ్యంగా విశాఖ-విజయవాడ మద్య సర్వీసులు నిలిచిపోయాయి. దీనివలన ఏపీఎస్ ఆర్టిసికి సోమవారం ఒక్కరోజే సుమారు రూ.93 లక్షలు నష్టం కలిగింది. ప్రైవేట్ బస్సులు కూడా తిరుగకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు. 

ఇక పెథాయ్‌ తుపాను ధాటికి రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్ళతో సహా 52 రైళ్లు రద్ధు చేయబడ్డాయి. మరో 9 దూరప్రాంతాల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్ళు రద్దు, ఆలశ్యంగా నడుస్తుండటంతో రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. 

పెథాయ్‌ తుపాను ధాటికి ఏకంగా 30 విమానాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్‌, బెంగళూరు నుంచి వచ్చిన విమానాలు విశాఖలో ప్రతికూల వాతావరణం నెలకొని ఉండటంతో వెనక్కు తిరిగి వెళ్ళిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 

పెథాయ్‌ తుపాను ప్రభావం ఉన్న పలు ప్రాంతాలలో సోమవారం మార్కెట్లు, కిరాణా దుఖాణాలు మూతపడ్డాయి. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న కాకినాడ, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలలో కొన్ని చోట్ల పెద్ద చెట్లు, నేలకొరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నందున ప్రాణనష్టం జరుగలేదు. పెథాయ్‌ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో చెదురుముదురుగా వానలుపడుతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత హటాత్తుగా పెరిగిపోయింది. ఆదిలాబాద్ వంటి ప్రాంతాలలో పగలు 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. మరో 24 గంటల వరకు పెథాయ్‌ తుపాను ప్రభావం ఉండవచ్చునని వాతావారణ శాఖ అధికారులు చెపుతున్నారు.