త్వరలో మోడీ, అమిత్ షా హైదరాబాద్‌ పర్యటన!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయఅధ్యక్షుడు అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి బిజెపి తరపున ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ, బిజెపి ఘోరపరాజయం పాలైంది. 119 స్థానాలకు పోటీ చేస్తే ఒకే ఒక స్థానం (గోషామహల్)లో గెలువగలిగింది. మాది అతిపెద్ద జాతీయపార్టీ అని ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఒకటొకటిగా గెలుచుకొస్తున్నామని తరువాత తెలంగాణలో కాషాయజెండా ఎగురవేస్తామని గొప్పలు చెప్పుకొన్న బిజెపి ఏకంగా 103 స్థానాలలో డిపాజిట్లు కోల్పోవడం, ఆ పార్టీ అధ్యక్షుడు సైతం ఓడిపోవడం ఆ పార్టీకి షాకులే.

ఆ షాకుల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్న రాష్ట్ర బిజెపి నేతలను నూతనోత్సాహం నింపి మళ్ళీ లోక్‌సభ ఎన్నికలకు సిద్దం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయఅధ్యక్షుడు అమిత్ షా డిసెంబరు 24వ తేదీన హైదరాబాద్‌ రాబోతున్నట్లు తాజా సమాచారం. అయితే రాష్ట్రంలో చావుదెబ్బ తిన్న బిజెపి మళ్ళీ ఇంత త్వరగా కోలుకోగలదా? అసలు ఆ పార్టీలో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెరాసలతో పోటీపడి గెలవగల అభ్యర్ధులున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శాసనసభ ఎన్నికలలో మోడీ, అమిత్ షాల మంత్రాలు పనిచేయలేదు. మరి లోక్‌సభ ఎన్నికలలోనైనా పనిచేస్తాయో లేదో చూడాలి.