కాంగ్రెస్‌ నేతలకు కేటిఆర్‌ కౌంటర్

ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి ఓడిపోయిందని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌ తిప్పికొట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలే నిజమనుకొంటే, మరి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోవాలా? దేశవ్యాప్తంగా అదే ఎన్నికల సంఘం...అవే ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తోందని అందరికీ తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగా ఓడిపోయామని కాంగ్రెస్‌ నేతలు వాదించడం సిగ్గుచేటు,” అని అన్నారు.