
శుక్రవారం పోలింగ్ ముగిసిన తరువాత సీనియర్ కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, విజయశాంతి, రేవంత్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. పోలింగ్ సరళిని బట్టి ఈసారి ఎన్నికలలో ప్రజాకూటమి పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం అయ్యిందని అన్నారు.
జాతీయసర్వే సంస్థలకు సహజంగానే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటుందని కనుక తెలంగాణ ఎగ్జిట్ సర్వేలు కూడా అదేవిధంగా ఉన్నాయని వాటిని పట్టించుకొనవసరం లేదని విజయశాంతి అన్నారు. ప్రజాకూటమి పూర్తిమెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఆమె అన్నారు.
కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భూతకాపు హామీలతో వంచించినందుకే, తెలంగాణ ప్రజలు ప్రజాకూటమి వైపు మొగ్గు చూపారని వి.హనుమంతరావు అన్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, మెదక్ జిల్లాలో ప్రజలు ప్రజాకూటమివైపే మొగ్గు చూపారని అన్నారు. ఈ ఎన్నికలలో కేసీఆర్ ఎంత అధికార దూరివినియోగానికి పాల్పడినప్పటికీ, డబ్బు వెదజల్లినప్పటికీ తెలంగాణ ప్రజలు ప్రజాకూటమికే ఓటు వేసి ఆయన నిరంకుశపాలనకు ముగింపు పలికారని వి.హనుమంతరావు అన్నారు.
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ “ఈ ఎన్నికల ఫలితాల గురించి నేను మొదటనుంచి చెపుతున్నదే జరుగబోతోంది. డిసెంబరు 12వతేదీన ప్రజాకూటమి పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యం. అప్పుడు కేసీఆర్ తన ఫాంహౌసుకు, కేటిఆర్ అమెరికాకు వెళ్లిపోవడం ఖాయం,” అని అన్నారు.