తెలంగాణ ప్రజలకు సోనియమ్మ విజ్ఞప్తి

యూపీయే చైర్ పర్సన్ సోనియాగాంధీ చేత నేడు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల ప్రచారం చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు భావించినప్పటికీ, ఆరోగ్యకారణాల చేత ఆమె రాలేకపోతున్నారు. కనుక ఆమె తెలంగాణ ప్రజలకు ఒక వీడియో సందేశం పంపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తాను తెలంగాణ ఏర్పాటు చేస్తే, అది కేసీఆర్‌ కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయిందని, కనుక ఈసారి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చగల ప్రజాకూటమిని గెలిపించాలని కోరారు.

ఆమె మాటలలోనే ఆ వీడియో సందేశం: 

తెలంగాణ సోదర, సోదరీమణులకు నమస్కారం. ఈనెల 7న మీరు మీ ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు ఓటు వేయబోతున్నారు. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తుతోపాటు మీ భవిష్యత్తు కూడా బాగుపడేందుకు ఉపయోగపడాలి. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ప్రజాకూటమి మీ గొంతుక. ఇది మీ కూటమి. ఈ కూటమి సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం ఏర్పాటైనది. 

నాలుగున్నరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నేను అత్యంత కీలక పాత్ర పోషించాను. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారి చేతిలో మీరు మోసపోయారు. తెలంగాణలో ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా..మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుకునే సమయం వచ్చింది. కనుక మీ అందరికీ నేఁ వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాకూటమికే ఓటేయండి. జై హింద్‌, జై తెలంగాణ.”