ఒక్కొక్కరూ కాదు అందరూ కలిసి రండి! రేవంత్‌ సవాల్

కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని సరైన కారణాలు చూపకుండా రాత్రిపూట అరెస్ట్ చేసినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషనుపై విచారణ చేపట్టిన హైకోర్టు రేవంత్‌రెడ్డిని ఎందుకు  అరెస్ట్ చేశారో కారణాలు తెలియజేయాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను గట్టిగా నిలదీసింది. హైకోర్టు గట్టిగా నిలదీయడంతో అప్రమత్తమైన పోలీసులు రేవంత్‌రెడ్డిని ఈరోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం నుంచి విడుదల చేశారు. వారే స్వయంగా రేవంత్‌రెడ్డి కారులో తీసుకువెళ్లి కొడంగల్‌లో ఆయన నివాసం వద్ద విడిచి పెట్టారు. 

కొద్దిసేపటి క్రితం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మహబూబ్‌నగర్‌కు రెండుసార్లు ప్రాతినిద్యం వహించిన కేసీఆర్‌ ఏనాడూ కొడంగల్‌ ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలలో గెలవడం కోసం సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేసి కొడంగల్‌ ఓట్లను కొనుగోలు చేయడానికి సిద్దపడ్డారు. కొడంగల్‌కు పోలీసుల వాహనంలోనే డబ్బు మూటలు తరలిస్తూ సిఎం కేసీఆర్‌ పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. కేసీఆర్‌కు కొంతమంది ఎన్నికల అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారు. వారి సహకారంతోనే కొడంగల్‌లో డబ్బు పంపిణీ చేస్తున్నారు. వారి సహకారంతోనే నామీద, నా అనుచరులు, మా కుటుంసభ్యుల ఇళ్ళలోకి చొరబడి భయబ్రాంతులను చేస్తున్నారు. 

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడినైనా నన్ను ఒక గొర్రెను ఈడ్చుకొని వెళ్ళినట్లు ఈడ్చుకొని వెళ్లారు. రాచరిక వ్యవస్థలో...సమైక్య రాష్ట్ర పాలనలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదు. ఆనాడు కోదండరామ్‌ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్ట్ చేసినప్పుడే తెలంగాణ సమాజం గట్టిగా స్పందించి ఉండి ఉంటే నేడు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుళు ఉండేవి కావు. పోరాటాలు చేసి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పరిపాలన చేస్తున్నారు. కొడంగల్‌లో తెరాస గెలవాలనుకొంటే ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప నన్ను, నా అనుచరులను అరెస్టులు చేస్తే కొడంగల్‌లో గెలుస్తారనుకోవడం అవివేకం. 

కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లే ఈ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఒక్కొక్కరే వచ్చారు. కానీ  సిఎం కేసీఆర్‌కు సవాలు చేస్తున్నాను. రేపు ఉదయం మీరు ముగ్గురు (కేసీఆర్‌, కేటిఆర్‌, హరీష్ రావు) కట్టకట్టుకొని ఇక్కడకు రండి. మీతో పాటు మీ ముఠాలు, మీ మూటలమ్ను కూడా వెంట బెట్టుకొనిరండి. అందరూ కలిసి వస్తే ఇక్కడ కొడంగల్‌లో చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కూర్చొని ప్రజల ముందే తేల్చుకొందాము. 

పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో కోట్ల రూపాయలు లభించాయని ఎన్నికల సంఘం రజత్‌కుమార్‌ స్వయంగా ప్రకటించినప్పటికీ ఆయనపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెరాస నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డిని వివరణ కోరి నాపై చర్యలు తీసుకొనేలా చేసిన రజత్‌కుమార్‌, పట్నం నరేందర్ రెడ్డిపై నేను ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? మరొక మూడు రోజులలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్పబోతున్నారు,” అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.