అందుకే నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు: కేసీఆర్‌

ప్రధాని నరేంద్రమోడీ నిన్న ఎల్బీ స్టేడియంలో సభలో తనపై చేసిన విమర్శలపై సిఎం కేసీఆర్‌ ఘాటుగా స్పందించారు. “నేను మోడీ ఏజంటునని కాంగ్రెస్‌ అంటుంది. నేను కాంగ్రెస్‌ ఏజంటునని బిజెపి అంటుంది. కానీ నాకు ఎవరి ఏజంటుగానో ఉండవలసినవసరం లేదు. నేను కేవలం తెలంగాణ ప్రజల ఏజంటును మాత్రమే. నా రాష్ట్రం, నా ప్రజల తరపున కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలతో గట్టిగా పోరాడుతున్నందుకే అందరూ కలిసి నాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. నేను జాతీయ రాజకీయాలలోకి వస్తే తాము రాజకీయంగా నష్టపోతామనే భయంతోనే ఆ మూడు పార్టీలు నన్ను ఈ ఎన్నికలలో ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వారు నన్ను అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ నేను జాతీయరాజకీయాలలో ప్రవేశించి వాటిని తప్పకుండా చీల్చి చెండాడుతాను. 

నిన్న ప్రధాని నరేంద్రమోడీ చెప్పినవన్నీ అబద్దాలే. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయిస్తే, నేను ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం రూ.4,000 కోట్లు కేటాయించాను. రానున్న రోజులలో నేను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ముస్లింలకు రిజర్వేషన్లు సాధిస్తాను. 

ఒక దేశప్రధాని ఇంత పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు. డిల్లీలో నాకంటే ఒడ్డూ పొడవు ఉన్న నాయకులు అనేకమంది ఉన్నారు. వారెవరికీ ఈ బక్కజీవి కేసీఆర్‌ చేసిన ఆలోచనలు ఎందుకు చేయలేకపోయారు? దేశంలో అనేక జీవనదులున్నాయి. ఒకపక్క ఏటా వేలాది టిఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంటే మరోపక్క సాగునీటి వసతి లేని కారణంగా లక్షలాది ఎకరాల భూములు బీడువారుతున్నాయి. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న ఆ నీటిని సద్వినియోగం చేసుకొంటే దేశంలో ఏడాదికి మూడు పంటలు పండించుకోవచ్చనే చిన్న ఆలోచన కాంగ్రెస్‌, బిజెపి పాలకులకు ఎందుకు కలుగలేదు? దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి వారు ఎందుకు ఆలోచించలేకపోయారు? వారు ఏడు దశాబ్ధాలలో ఏమీ చేయలేకపోయినప్పటికీ,నాలుగేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి చూపిన నన్ను వారు వేలెత్తి చూపుతుండటం సిగ్గుచేటు. 

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు నాగురించి నోటికి వచ్చినట్లు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. అందుకు ఆ మూడు పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ది చెప్పాలి,” అని కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలలో ప్రజలను కోరారు.