కేసీఆర్‌ సమర్ధుడైతే...మోడీ చురకలు

ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో బిజెపి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ, సిఎం కేసీఆర్‌ అసమర్ధత, కుటుంబపాలన, ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ళు నష్టపోయిందని విమర్శించారు.

“గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటిన్నర ఇళ్ళను నిర్మించి అర్హులైన పేదవారికి ఇంటి తాళాలు అందజేస్తే వారందరూ ఈఏడాది దీపావళి పండుగను వారి సొంత ఇళ్ళలో ఆనందంగా జరుపుకొన్నారు. కానీ ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుటుంబపాలన, ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యం అనుకొంటారు. అందుకే ఇళ్ళు నిర్మాణాల కోసం కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు అందిస్తున్నప్పటికీ నాలుగేళ్ళలో ఆయన కేవలం 5,000 ఇళ్ళు మాత్రమే నిర్మించగలిగారు. సమర్ధమైన నాయకత్వం, చిత్తశుద్ది, ప్రజలే మన కుటుంబమనుకొంటే ఏదైనా సాధ్యమే. 

మన దేశంలో 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్‌ ఏవిధంగా హామీ ఇచ్చారు. వేరెవరి కోటాను కత్తిరించి వారికి ఇద్దామనుకొన్నారు? సాధ్యం కానివి చేస్తానని చెప్పి ప్రజలను నమ్మించడం మోసం కాదా? ఇవి ఓటు బ్యాంక్ రాజకీయాలు కావా? మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని ఆనాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నిర్ణయించారు. కానీ కేసీఆర్‌ ఇస్తానని చెపుతున్నారు. ఇది ఆయనను అవమానించడం కాదా?

బిజెపికి బి-పార్టీ తెరాస అంటున్నారు కానీ కేసీఆర్‌ గతంలో యూపీయే ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సంగతి మరిచిపోయారా? కర్ణాటకలో జెడిఎస్ పార్టీని కూడా బిజెపికి బీ-పార్టీ అని వాదించారు. కానీ చివరికి దానితో ఎవరు చేతులు కలిపారు? కాంగ్రెస్‌, తెరాసలు కాదా? అంటే ఏ పార్టీ దేనికి బి-పార్టీయో మీరే చెప్పాలి.

రాష్ట్ర విభజన చేసినందుకు ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని డిపాజిట్లు రాకుండా ఓడిస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో టిడిపి చేతులు కలిపి ఆంధ్రా ప్రజలను అవమానించింది. 

కాంగ్రెస్‌, టిడిపి, తెరాస మూడు పార్టీలదీ కుటుంబ పాలనే. ఆ పార్టీలలో వారి కుటుంబాలకు తప్ప వేరెవరికీ అధికారం లభించదు. దేశంలో ఒక్క బిజెపి మాత్రమే లౌకికవాదపార్టీ. ఈ కుటుంబపాలనను అంతం చేస్తే కానీ లౌకికవాద ప్రభుత్వాలు ఏర్పడలేవు. కనుక ఈ మూడు పార్టీలకు ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలి,” అని మోడీ అన్నారు.