తెరాస మేనిఫెస్టోలో కౌలు రైతుల ఊసేలేదు: కోదండరామ్‌

సోమవారం మధ్యాహ్నం గద్వాల్ లో జరిగిన ప్రజాకూటమి బహిరంగసభలో టీజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ మాట్లాడుతూ, “తెరాస నిన్న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. అలాగే ఉద్యోగాల కల్పనపై కూడా ఎటువంటి నిర్ధిష్టమైన హామీ, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించలేదు. లక్ష రూపాయల వరకు పంటరుణాల మాఫీ చేస్తామని పేర్కొంది కానీ ఒకేసారి చెల్లిస్తుందా లేక గతంలోలాగే నాలుగు వాయిదాలలో చెల్లిస్తుందా? అనే విషయం నిర్ధిష్టంగా చెప్పలేదు. అంటే ఈ సమస్యల పరిష్కారం పట్ల నేటికీ తెరాసకు ఆసక్తి, చిత్తశుద్ది లేదని స్పష్టమవుతోంది. 

అదే...ప్రజాకూటమి అధికారంలోకి వస్తే మేము ఏమి చేస్తామో చాలా నిర్ధిష్టంగా చెపుతున్నాము. మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా మిగిలిన రైతులందరికీ ఇస్తున్న అన్ని పధకాలను, రాయితీలను వర్తింపజేస్తాము. ఎందుకంటే మిగిలిన రైతులందరికంటే కౌలు రైతులే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. నిర్ధిష్టమై క్యాలెండర్ ప్రకారం ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తాము. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుధ్యోగా భృతిని చెల్లిస్తాము. ఒకేసారి రూ.2 లక్షల పంటరుణాలు చెల్లిస్తాము. 

మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల పెన్షన్లు రద్దు చేస్తామని తెరాస మాపై దుష్ప్రచారం చేస్తోంది. కానీ తెరాస ఇస్తున్న పెన్షన్లను మేము రెట్టింపు చేస్తామని ప్రకటించినప్పుడు మమ్మల్ని అవహేళన చేసిన తెరాస, ఇప్పుడు మేము కూడా ఇస్తామంటూ మేము ప్రకటించిన దానికి మరో రూ.16 కలిపి ప్రకటించింది. తెరాస ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ ఇస్తుంటే మేము ఒక కుటుంబంలో అర్హులైన అందరికీ ఇస్తామని చెపుతున్నాము. అంటే పెన్షన్ల విషయంలో తెరాస కంటే మాకే చిత్తశుద్ది ఉందని స్పష్టం అవుతోంది. ప్రజాకూటమి మేనిఫెస్టో, ఉమ్మడి అజెండాలో  మేము పేర్కొన్న ప్రతీ హామీని తప్పకుండా అమలుచేస్తాము.

నాలుగేళ్ల కేసీఆర్‌ నిరంకుశత్వ కుటుంబ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసగించారు. అన్ని వర్గాల ప్రజలు అవమానింపబడ్డారు. ఈ నిరంకుశ పాలన అంతమొందించి తెలంగాణ ప్రజలు కోరుకొన్నవిధంగా ప్రజాస్వామ్యబద్దంగా పారదర్శకంగా పాలన సాగించే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రజాకూటమి ఏర్పాటు ప్రజాకూటమి అభ్యర్ధులను గెలిపించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కోదండరామ్‌ అన్నారు.