నగరంలో నేడు రాహుల్-బాబు రోడ్ షోలు

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి సోమవారం హైదరాబాద్‌ నగరంలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ మొదట జూబ్లీహిల్స్‌ పరిధిలో వెంకటగిరి, కృష్ణాగనగర్‌, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌, శ్రీరామ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తరువాత కార్మికనగర్‌, యూసుఫ్‌గూడ, కళ్యాణ్‌నగర్‌, ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌, గోకుల్‌ థియేటర్‌ మీదుగా కూకట్‌పల్లి చేరుకొంటారు. కూకట్‌పల్లిలో చంద్రబాబు నాయుడుతో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ ప్రచారం ముగించుకొని మళ్ళీ బేగంపేట విమానాశ్రయం చేరుకొని డిల్లీ తిరిగి వెళతారు. 

ఈసారి ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. ఒకవేళ రాలేకపోతే వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోలేనివిధంగా సిఎం కేసీఆర్‌ బలహీనపరచడం ఖాయం. కనుక ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరికీ కూడా జీవన్మరణ సమస్య వంటివని చెప్పవచ్చు. తెలంగాణ టిడిపి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితిలో ఉంది. కనుక రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ నేడు మళ్ళీ కేసీఆర్‌, ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేసి, నగరంలోని ప్రజలను ప్రజాకూటమివైపు ఆకర్శించేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయం.          

కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో బిజెపి, తెలంగాణలో తెరాసలు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు కనుక రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం సహజమే. కానీ గ్రేటర్ ఎన్నికలలో ‘తెరాస, కేసీఆర్‌’ అనే రెండు పదాలను పలకడానికి కూడా భయపడిన చంద్రబాబు నాయుడు ఈసారి చాలా ధైర్యంగా కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తూ ఎండగడుతుండటమే చాలా ఆశ్చర్యకరమైన మార్పు అని చెప్పవచ్చు.