ఈరోజు కేసీఆర్ సభలు వెరీ స్పెషల్ ఎందుకంటే...

ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు ఈ అమూల్యమైన కొద్దిపాటి సమయాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు ఎన్నికల ప్రచారం జోరు పెంచాయి. సిఎం కేసీఆర్‌ ఈరోజు ఆరు సభలలలో పాల్గొనబోతున్నారు. 

ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి సభలో పాల్గొంటారు. ఆ తరువాత వరుసగా ఒంటి గంటకు మధిర, 1.45కు కోదాడ, 2.30కు హుజూరాబాద్, 3.30కు మిర్యాలగూడ, సాయంత్రం 4.30కు నల్గొండ బహిరంగసభలలో పాల్గొంటారు. 

ఈరోజు సభలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌, టిడిపిలలో హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. సత్తుపల్లిలో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా పేర్కొనబడిన సండ్ర వెంకట వీరయ్య (టిడిపి), మధిరలో సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్లుభట్టి విక్రమార్క, కోదాడలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధాంగి పద్మావతీ, మిర్యాలగూడలో బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య (కాంగ్రెస్‌) మరియు విధ్యాధర్ రెడ్డి (తెలంగాణ జనసమితి), నల్గొండలో కేసీఆర్‌ను గట్టిగా సవాలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‌) పోటీ చేస్తున్నారు. అంటే సిఎం కేసీఆర్‌ ఈరోజు చాలా కీలకమైన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం సభలు నిర్వహించబోతున్నారని అర్దమవుతోంది. 

బుదవారం సాయంత్రం 5 గంటలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుంది కనుక సిఎం కేసీఆర్‌ మళ్ళీ ఈ 6 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు కనుక కాంగ్రెస్‌, టిడిపిలకు కంచుకోటలుగా చెప్పుకోబడుతున్న ఆ 6 నియోజకవర్గాలలో ఓటర్లను తెరాసవైపు తిప్పుకోవడానికి సిఎం కేసీఆర్‌ ఈరోజు సభలలో గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది.