కేసీఆర్‌ 100, హరీష్ 90...అసలు ఎన్ని?

ఈసారి ఎన్నికలలో గెలుపు ఖాయం అని సిఎం కేసీఆర్‌ మొదలు పార్టీ అభ్యర్ధుల వరకు అందరూ నమ్మకంగా చెపుతున్నారు. అయితే తెరాస ఎన్ని సీట్లు గెలుచుకోబోతోందనే విషయంలోనే ఎవరికీ స్పష్టత ఉన్నట్లు లేదు.  సికింద్రాబాద్‌ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని పునరుద్ఘాటించారు. అదే సమయంలో సంగారెడ్డి పట్టణంలో తెరాస అభ్యర్ధి చింతా మోహన్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి హరీష్ రావు తెరాస 90 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయమని చెప్పడం విశేషం. తెరాస అధిష్టానంలో నలుగురు ముఖ్యనేతల మాటలలోనే 10 సీట్లు తేడా కనిపిస్తుండటం విశేషం. కేసీఆర్‌ 100 ప్లస్ అని చెపుతుంటే హరీష్ రావు 90 సీట్లు గెలుస్తామని చెప్పడం విశేషం.

ఈసారి ఎన్నికలలో 8-10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలుపొందబోతున్నారనే లగడపాటి సర్వేను కేసీఆర్‌ గట్టిగా కొట్టి పారేసినప్పటికీ ఆయన సర్వే ప్రకారమే జరుగబోతోందని తెరాస నమ్ముతోందా?అనే అనుమానం కలుగుతోంది. ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో  ముగియబోతోంది. కీలకమైన ఈ చివరి 34 గంటలలో తెరాస నేతలు అందరూ తెరాస గెలుచుకోబోయే సీట్ల విషయంలో ఒకే విధంగా మాట్లాడితే మంచిది. చివరి నిమిషంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే తెరాసకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.