.jpg)
మంత్రి కేటిఆర్ గురువారం కూకట్‌పల్లిలో తమ పార్టీ అభ్యర్ధి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత నాలుగేళ్ళుగా తెలంగాణవైపు చూడని చంద్రబాబు నాయుడుకి ఇప్పుడే మన రాష్ట్రం గుర్తొచ్చిందా? కూకట్‌పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా బరిలో దిగిన సుహాసిన ఎలాగూ గెలవదని అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గం గురించి, ఇక్కడి ప్రజల సమస్యల గురించి ఏమాత్రం అవగాహనలేని ఆమెను నిలబెట్టి చంద్రబాబు ఆమెను ‘బకరా’ చేశారు. ఆమె ఇద్దరు సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రేపు ఆమె తరపున ఎన్నికల ప్రచారానికి వస్తే వారు కూడా బాబు చేతిలో బకరాలుగా మారుతారు. బాబుకు ఆమెపై నిజంగా అంత ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే తన కొడుకు లోకేశ్ ను ఏవిధంగా తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారో అలాగే ఆమెను కూడా తీసుకోవచ్చు కదా? తెలంగాణలో మళ్ళీ పాగావేయాలని చంద్రబాబు అంతా తహతహలాడుతున్నట్లయితే, సుహాసినికి బదులు తన కొడుకు నారా లోకేశ్ నే పోటీ చేయించవచ్చు కదా?
కూకట్‌పల్లి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో మళ్ళీ తెరాస ప్రభుత్వమే వస్తుంది. కనుక మీరు ఆమెకు ఓట్లు వేసి గెలిపించినట్లయితే ఆమె మీ సమస్యలను పరిష్కరించలేదు. తెరాస అభ్యర్ధిని గెలిపిస్తే ఆయన ఎప్పటిలాగే మీ సమస్యలన్నిటినీ పరిష్కరించగలరు. ఎలాగూ ఓడిపోబోతున్న సుహాసినికి ఓట్లు వేస్తే అవన్నీ మురిగిపోతాయి. పొరపాటున ప్రజాకూటమి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పడక మునుపటి పరిస్థితులన్నీ పునరావృతం అవుతాయని గుర్తుంచుకోండి. కనుక తెరాసకే అందరూ ఓట్లేసి గెలిపించుకొంటే రాష్ట్రంలో ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ జోరుగా కొనసాగుతాయి,” అని అన్నారు.